సంగారెడ్డి : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం 30 నుంచి 40 రోజుల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హకీంపేటలో ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు బాబురావు తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల యువతీ యువకుల నుంచి వసతి సౌకర్యం లేని కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. 8వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏండ్ల వయస్సు గల వారికి లైట్‌మోటార్ వెహికిల్ డ్రైవింగ్ కోసం 30 రోజుల శిక్షణ, అదేవిధంగా 8వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏండ్ల వయస్సు గల వారికి హెవీమోటారు వెహికిల్ డ్రైవింగ్ కోసం 40 రోజుల శిక్షణ అందిస్తారని వివరించారు. కావున ఆసక్తిగల వారు వారి పూర్తి వివరాలతో కులం, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2 లక్షలు మించకుండా మీ సేవ నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జూన్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 9989766900 నెంబర్‌పై సంప్రదించాలన్నారు.