notifications

రైలు భద్రతా సిబ్బంది పోస్టులు ఖాళీ

webdesk | Monday, January 23, 2017 10:59 AM IST

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రైలు భద్రతా సిబ్బంది పోస్టులు లక్షల సంఖ్యల్లో ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడంతో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో ఐదు రైలు ప్రమాదాలు జరిగాయి. పలుచోట్ల వివిధ రైళ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు వందల సంఖ్యలో మృతి చెందిన విషయం విదితమే. తాజాగా హీరాఖండ్ రైలు పట్టాలు తప్పడంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.42 లక్షల రైలు భద్రతా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 24 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 6,398 ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 4,827 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. 67 సెక్యూరిటీ పోస్టులు, 93 సిగ్నల్ మరియు టెలికాం, 613 పోస్టులు ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీలున్నట్లు రైల్వే బోర్డు ద్వారా తెలిసింది. 

తక్షణమే రైలు భద్రతా సిబ్బంది ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని రిటైర్డ్ రైల్వే అధికారులు, రైల్వే యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సరిపడ ఉద్యోగులు లేకపోవడంతో ఒక్కో ఉద్యోగి 20 నుంచి 24 గంటలు పని చేయాల్సి వస్తుందన్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు.