notifications

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ: సీపీ సజ్జనార్

Webdesk | Thursday, July 12, 2018 12:20 PM IST

  హైదరాబాద్ : పేద, వెనకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైయ్యే శిక్షణను ఉచితంగా అందించేందుకు సైబరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ప్రభుత్వం సహకారంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సాయంతో నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక శిక్షణ తరగతుల శిబిరాలను ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించారు. ఈ శిక్షణ శిబిరాల్లో నిష్ణాతులైన పోలీసు అధికారులతో పాటు ఇతర సబ్జెక్ట్‌ల్లో ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులతో బోధన తరగతులను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణను అవకాశంగా తీసుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సీపీ సజ్జనార్ కోరారు. 

 

ఉచిత శిక్షణకు పొందేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలివి..


* అభ్యర్థి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఉండాలి. 
* ఈ ఉచిత శిక్షణ పోలీసు అధికారుల పరిశీలనలో మెయిన్స్ పరీక్షల వరకు కొనసాగుతుంది. 
* హాస్టల్ సౌకర్యం ఉండదు.
* యువతీ, యువకులకు ఈ శిక్షణ ఉంటుంది. 
* శారీరక ధృడత్వ పరీక్షలు, ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఈ ఉచిత శిక్షణ ఉంటుంది. 
* ఆసక్తి గల వారు జూలై 15, 16, 17 తేదిల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్పోర్ట్స గ్రౌండులో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 
* ఫిజికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు జీకే పరీక్ష ఉంటుంది. 
* ఈ అర్హతలు సాధించిన యువకులకు 6 నుంచి 8 నెలల వరకు ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయి. 
* అర్హత సాధించిన అభ్యర్థులకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, రాజేంద్రనగర్, మెయినాబాద్, శంషాబాద్ ప్రాంతాల్లో శిక్షణ తరగతులు ఉంటాయి. 
* శిక్షణ తరగతులు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. 
* శిక్షణకు అర్హత సాధించిన యువతకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తారు. 
* శంషాబాద్ డీసీపీ పద్మజ, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారుల పరిశీలనలో ఈ ఉచిత శిక్షణ కొనసాగుతుంది.మరిన్ని వివరాల కోసం కృష్ణకుమార్ (పోలీసు కానిస్టేబుల్, రాజేంద్రనగర్-9177691110), యాదయ్య (పోలీసు కానిస్టేబుల్-మైలార్‌దేవ్‌పల్లి-7901114274),గోపాల్ (కానిస్టేబుల్- మొయినాబాద్-9177589026), ఆంజనేయిలు (శంషాబాద్-కానిస్టేబుల్-9640870790), సైబర్ కంట్రోల్-9490617100 ఫోన్ నెంబర్‌ల్లో సంప్రదించాలని సీపీ వివరించారు.