news

యేడాదిపాటు ఓయూ శతాబ్ది ఉత్సవాలు

webdesk | Monday, January 9, 2017 8:39 PM IST

యేడాదిపాటు ఓయూ శతాబ్ది ఉత్సవాలు

 

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ నూరేళ్లు నిండిన సందర్భంగా నిర్వహించనున్న సంబురాలకు సంబంధించి ఏర్పాట్లపై ఇవాళ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కే కేశవరావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఓయూ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు, ఉస్మానియా వర్సిటీకి మధ్య అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 26, 27, 28తేదీల్లో ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఉంటాయని వెల్లడించారు. శతాబ్ది ఉత్సవాల్లో మొదటి మూడు రోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ చరిత్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఎప్పటికీ గుర్తుండేలా ఏడాదిపాటు ఉత్సవాలు సాగుతాయని చెప్పారు. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 30 కమిటీలు వేశామన్నారు. 

ఈ శతాబ్ది ఉత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ, ఏఐసీటీయూ, యూజీసీలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఆర్థికంగా కేంద్రం నుంచి సాయం కూడా కోరనున్నట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న ఆల్ ఇండియా వీసీల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 28న ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్‌కు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. ఓయూ ప్రారంభం నుంచి ప్రచురణ అయిన ఉత్తమ వంద పబ్లికేషన్స్‌తో పుస్తకం తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఉస్మానియాలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వారి పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నట్టు తెలిపారు. ఓయూ చరిత్రను భావితరాలకు అందించేలా వీడియో రూపొందిస్తున్నామని తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ను కలిసి ఉత్సవాలపై స్పష్టత తీసుకుంటామన్నారు. ఉత్సవాల లోగో, బ్రోచర్, పోస్టర్, వెబ్‌సైట్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఉస్మానియాకు న్యాక్ గుర్తింపు లేదన్నది అవాస్తవమన్నారు. రెగ్యులర్ వీసీ లేనందున రెన్యూవల్ చేయలేదని వివరించారు. మార్చిలోపు న్యాక్ గుర్తింపు రెన్యువల్ చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల మెస్ బిల్లులను కూడా సీఎం కేసీఆర్ క్లియర్ చేశారని వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ పోతున్నామని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు జీవో 14 ప్రకారం 50 శాతం పెంచామని స్పష్టం చేశారు. దీంతో వేతనం రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెరుగుతుందని వివరించారు. రెగ్యులర్ చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. అనవసరంగా రాజకీయ ప్రలోభాలకు లొంగి ఇబ్బందులు పడొద్దన్నారు.