news

ఐసీఐసీఐలో పీవోలు

Webdesk | Thursday, December 22, 2016 11:51 PM IST

ఐసీఐసీఐలో పీవోలు

* ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీ కోర్సు
* అనంత‌రం డెప్యూటీ మేనేజ‌ర్ గా ఉద్యోగం

ప్రముఖ ప్రైవేటు రంగ‌ బ్యాంకు ఐసీఐసీఐ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. డిగ్రీ పూర్తి చేసిన‌వాళ్లు వీటికోసం పోటీప‌డొచ్చు. ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అన్ని విభాగాల్లోనూ ప్రతిభ చూపినవారికి పీజీడీబీ కోర్సులో ప్రవేశం క‌ల్పిస్తారు. వీరంతా బెంగ‌ళూరులోని ఐసీఐసీఐ మ‌ణిపాల్ అకాడెమీ (ఐఎంఏ)లో ఏడాది వ్యవ‌ధి ఉండే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (పీజీడీబీ) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు ఐసీఐసీఐలో డెప్యూటీ మేనేజ‌ర్‌ హోదాతో విధుల్లో చేర‌వ‌చ్చు. ఈ స‌మ‌యంలో అన్నీ క‌లుపుకుని ఏడాదికి రూ.4 లక్షలు (సీటీసీ) వేత‌నంగా పొంద‌వ‌చ్చు.

విద్యార్హత‌: క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: డిసెంబ‌రు 31, 2016 నాటికి గ‌రిష్ఠంగా 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే డిసెంబ‌రు 31, 1991 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు, ఆన్‌లైన్ సైకో మెట్రిక్ క్వశ్చన‌రీ, కేస్ బేస్డ్ గ్రూప్ డిస్కష‌న్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూల ద్వారా 
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌రు 31.

ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్‌ ప‌రీక్షలో:
వెర్బల్ కాంప్రహెన్షన్‌, న్యూమ‌రిక‌ల్ కాంప్రహెన్షన్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్ అంశాల్లో ప్రశ్నలు వ‌స్తాయి. ఈ ప‌రీక్షను జ‌న‌వ‌రిలో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన‌ వారికి సైకోమెట్రిక్ ప‌రీక్ష, బృంద‌చ‌ర్చలు ఉంటాయి. ఈ రెండు ద‌శ‌లూ విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్నవారికి ముఖాముఖి నిర్వహించి తుది నియామ‌కాలు ఖ‌రారు చేస్తారు. వీరికి ఐఎంఏ-బెంగ‌ళూరులో ఏడాది పీజీడీబీ కోర్సులో చేర‌డానికి అర్హత ల‌భిస్తుంది. కోర్సుకు ఎంపికైన‌వారికి విడ‌త‌ల‌వారీ 2017లో ఫిబ్రవ‌రి, మే, ఆగ‌స్టు, న‌వంబ‌రు మొద‌టి వారంలో శిక్షణ త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి.

కోర్సు వివ‌రాలు...
ఏడాది వ్యవ‌ధి ఉండే ఈ కోర్సును నాలుగు భాగాలుగా విభ‌జించారు. మొద‌టి ద‌శ‌లో 4 నెల‌లు పూర్తిగా త‌ర‌గ‌తి గ‌ది శిక్షణ ఉంటుంది. రెండో ద‌శ‌ 2 నెల‌ల పాటు ఐసీఐసీఐలో శిక్షణ‌(ఇంట‌ర్న్‌షిప్‌), మూడో ద‌శ‌ 2 నెల‌లు మ‌ళ్లీ త‌ర‌గ‌తి గ‌ది శిక్షణ‌, నాలుగో ద‌శ‌ 4 నెల‌లు ఐసీఐసీఐలో ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. త‌ర‌గ‌తి గ‌ది శిక్షణ‌లో భాగంగా బ్యాంకుల్లో జ‌రిగే రోజువారీ కార్యక‌లాపాల‌తోపాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ఆర్థిక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఈ కోర్సులో చేరే అభ్యర్థులు ఫీజు చెల్లించ‌డం త‌ప్పనిస‌రి. ఇందుకోసం ప‌న్నుల‌తో స‌హా రూ.3,78,000 చెల్లించాలి. ఈ మొత్తానికి ఐసీఐసీఐ రుణం స‌మ‌కూరుస్తుంది. అభ్యర్థులు విధుల్లో చేరిన త‌ర్వాత సులభ వాయిదాల్లో చెల్లించుకునే వెసులుబాటు ఉంది. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఏదైనా ఐసీఐసీఐ బ్రాంచ్‌లో డెప్యూటీ మేనేజ‌ర్ హోదాతో విధుల్లో చేర‌తారు. వీరికి బ్యాంకు ఏడాదికి రూ. 4 ల‌క్షలు వేత‌నం అందిస్తుంది.